కార్పొరేట్ల చేతులలోకి ప్రభుత్వ వైద్య కళాశాలలు !

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలల నుండి వేలాది మంది వైద్యులు వైద్య విద్యనభ్యసించి, భారతదేశంలోనూ మరియు ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో ప్రతిష్టాత్మక స్థానాలను సాధించారు. వారు ప్రభుత్వ వైద్య కళాశాలల నుండి పొందిన నాణ్యమైన వైద్య విద్యకు కృతజ్ఞతగా ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థులను మరియు రాష్ట్రంలో ఇతర ప్రభుత్వ వైద్య కళాశాలల పూర్వ విద్యార్థుల ను, ప్రభుత్వ వైద్య విద్య ద్వారా వారు పొందిన ప్రయోజనాన్ని, దాని విలువను గుర్తుంచుకుని, ఆంధ్రప్రదేశ్‌లోని వైద్య కళాశాలల వాణిజ్యీకరణ / ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

  • డా. పి. రామారావు, రిటైర్డ్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి, ఆంధ్రప్రదేశ్

గత దశాబ్ద కాలంలో భారతదేశంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు ఆసుపత్రులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ధోరణి వేగవంతమైంది. ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ప్రభుత్వం ఇటీవల 10 కొత్త వైద్య కళాశాలలను కార్పొరేట్ సంస్థలకు దీర్ఘకాలిక నియంత్రణకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై ప్రభుత్వానికి ఏపీలో బలమైన ప్రజా వ్యతిరేకత ఎదురవుతోంది, దీని ప్రభావం రాష్ట్రాన్ని అధిగమించి దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది.

ప్రజారోగ్య వ్యవస్థలను ప్రయివేటీకరించడం ప్రజా వ్యతిరేక నిర్ణయం

2025 ప్రారంభంలో, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) మోడల్‌లో అభివృద్ధి చేసి, వాటిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని ప్రకటించింది. మార్చి 5, 2025న, రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ ఈ నిర్ణయాన్ని శాసనసభలో తెలిపారు. GO 107 మరియు GO 108 ఆదేశాల ద్వారా సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్ల సంఖ్యను పెంచి, MBBS విద్యార్థులకు సంవత్సర ఫీజు “రూ.12 లక్షల నుండి రూ. 20 లక్షల”కు పెంచారు. దీనివల్ల ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వైద్య విద్య ఖర్చు దాదాపు రూ. 1 కోటికి చేరుతుంది. సగటున రూ. 500 కోట్లతో ప్రభుత్వ నిధులతో నిర్మించిన 17 కొత్త వైద్య కళాశాలల్లో 10 కాలేజీలను 66 సంవత్సరాల పాటు నామమాత్ర ఫీజుకు ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇవ్వాలని ప్రతిపాదించారు.

ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలను ప్రయివేటీకరించడం వల్ల జరిగే నష్టం

ఆరోగ్య కార్యకర్తలు, పౌర సమాజాలు, విద్యార్థి సంఘాలు, వైద్య నిపుణులు, మరియు ప్రజలు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జన స్వాస్థ్య అభియాన్ యొక్క ఆంధ్రప్రదేశ్ శాఖ “ప్రజా ఆరోగ్య వేదిక” (PAV) ఈ PPP మోడల్ రాష్ట్రంలో ఆరోగ్య సేవలు మరియు వైద్య విద్యకు గట్టి దెబ్బ అని హెచ్చరించింది. PPP విధానంలో, ప్రభుత్వం 80% వ్యయాన్ని (రాష్ట్ర, కేంద్ర నిధుల ద్వారా) భరిస్తుంది, ప్రైవేట్ ఆపరేటర్ కేవలం 20% మాత్రమే ‘కంట్రిబ్యూట్ చేస్తారు. అది కూడా ప్రభుత్వ భూమిని తాకట్టు పెట్టి సమకూర్చుకోవచ్చు. ఈ ఆర్థిక భారం విద్యార్థులు మరియు రోగులపై పడుతుంది. PAV మరియు ఇతర మేధావులు ఈ PPP విధానం వల్ల ఆర్థికంగా బలహీనమైన విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులో లేకుండా చేస్తుందని, మెరిట్ ఆధారిత ప్రవేశాలను బలహీనపరుస్తుందని, రిజర్వేషన్ సీట్లను తగ్గిస్తుందని, మరియు ప్రజా జవాబుదారీతనాన్ని క్షీణింపజేస్తుందని వాదిస్తున్నారు. పాఠ్యక్రమాలు, ఆసుపత్రి మౌలిక సదుపాయాలు, మరియు ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్య సేవల ప్రాధాన్యతలపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఉందని, ప్రజారోగ్య సేవ స్థానంలో ప్రయివేటు యాజమాన్యాల లాభాపేక్ష ఆధిపత్యం చెలాయిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా పోరాటం

ఈ హానికరమైన నిర్ణయానికి వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్‌లో బలమైన ప్రజా ఉద్యమం రూపొందింది. ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఈ PPP విధానాలు, ప్రజలకు కలిగే నష్టాలపై అవగాహన కలిగించే కార్యక్రమాలను ప్రారంభించింది. మార్చి 10, 2025న, ఆరోగ్య మంత్రికి సమర్పించిన మెమోరాండమ్‌లో, ప్రజా ఆరోగ్య వ్యవస్థల ప్రయివేటీకరణ అనేది ఆరోగ్య హక్కు ఉల్లంఘనే అని తమ ఆందోళనల తెలియజేసారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం తేదీ ఏప్రిల్ 7, 2025 నాడు, అనంతపురం, విశాఖపట్నం వంటి జిల్లాల్లో ఈ PPP కి వ్యతిరేకంగా ప్రజల సంతకాల సేకరణ ప్రచారం ప్రారంభమైంది, PPP ప్రణాళికను పూర్తిగా ఉపసంహరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై విజయవాడ (ఏప్రిల్ 20) మరియు విశాఖపట్నం (ఏప్రిల్ 21)లో పెద్ద పెద్ద సదస్సులు నిర్వహించారు, ఆరోగ్య నిపుణులు, మాజీ ఉన్నతాధికారులు, విద్యార్థి సంఘాలు, మరియు పౌర సమాజాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురం (మే 23), కాకినాడ (మే 28), గుంటూరు (జూన్ 6), తూర్పు గోదావరి, మరియు శ్రీకాకుళం (జూన్ 21) లో జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి, ఇందులో NEET aspirants మరియు తల్లిదండ్రుల సంఘాలు కూడా పాల్గొని తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు.

పెద్ద ఎత్తున సదస్సులు, సమావేశాల నిర్వహణ

మార్చి 23, 2025న తిరుపతిలోని SV వైద్య కళాశాల ఆడిటోరియంలో 800 మందికి పైగా ప్రధానంగా ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, పౌర సమాజ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్న హైల్త్ సదస్సు జరిగింది. ప్రజారోగ్య వ్యవస్థలను ప్రభుత్వ బాధ్యతగా ఆరోగ్య సేవలను కొనసాగించాలని, వైద్య విద్య ప్రైవేటీకరణను సదస్సుకు హాజరైన విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు, మరియు పౌర సమాజ సంఘాల వక్తలు ఈ PPP మోడల్ వినాశకరమని పేర్కొన్నారు. జూన్ 15న నెల్లూరులో 500 మంది పాల్గొన్న మరో సమావేశంలో, మాజీ ఆరోగ్య కార్యదర్శి డా. పి.వి. రమేష్, IAS మరియు ప్రజా ఆరోగ్య నిపుణుడు డా. డేవిడ్ సుధాకర్, అత్యవసర ఆరోగ్య సేవల ప్రైవేటీకరణ యొక్క దీర్ఘకాలిక నిర్మాణాత్మక పరిణామాలను, నష్టాలను గురించి హెచ్చరించారు.

పోరాటానికి విస్తృత మద్దతు

ఈ ఉద్యమం విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రభుత్వ వైద్యుల సంఘాలు, రిటైర్డ్ ఆరోగ్య నిపుణులు, కొంతమంది ప్రైవేట్ వైద్యులు, ASHAలు, ఆంగన్‌వాడీ కార్యకర్తలు, ల్యాబ్ టెక్నీషియన్లు, రిటైర్డ్ నర్సులు, నర్సింగ్ ఫ్యాకల్టీ, ట్రేడ్ యూనియన్లు, న్యాయవాదులు, మరియు మహిళా సమూహాల నుండి విస్తృత మద్దతును పొందింది. డా. జి. సమరం, మాజీ భారతీయ వైద్య సంఘం అధ్యక్షుడు, మరియు మాజీ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సుజాత రావు, IAS వంటి ప్రముఖులు ఈ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించారు.

విద్యార్థుల పాత్ర

SFI, AISF, PDSU, RSU, మరియు NSUI వంటి ఐదు ప్రధాన విద్యార్థి సంఘాలు వైద్య ఆరోగ్య రంగంలో PPP నిర్ణయాన్ని ఉపసంహరించాలని ముఖ్యమంత్రికి ఉమ్మడిగా లేఖ రాశాయి. 2024లో, గుంటూరు, రాజమండ్రి, విజయనగరం, తిరుపతి, మరియు విశాఖపట్నం క్యాంపస్‌లలో విద్యార్థులు నిరాహార దీక్షలు, ర్యాలీలు, మరియు నిరసనలు నిర్వహించారు.

వైద్యరంగ ప్రయివేటీకరణ వెనుక నీతి ఆయోగ్ పాత్ర

ప్రభుత్వ ఆరోగ్య సంస్థల ప్రైవేటీకరణకు 2014 నుండి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నీతి ఆయోగ్ పాత్ర ఈ PPP విధానం వెనుక దాని మూలాలు కలిగి ఉంది. జనవరి 21, 2020న, నీతి ఆయోగ్ PPP ఆధారిత వైద్య కళాశాలలను ప్రోత్సహించడానికి జాతీయ సంప్రదింపులు నిర్వహించింది, రాష్ట్రాలకు ఈ మోడల్‌ను అనుసరించమని సూచించింది. 2019లో NHM మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ జిల్లా ఆసుపత్రులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే మార్గదర్శకాలను జారీ చేశాయి. 2020–21లో, కేంద్ర విధానాలు 60% వరకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, పూర్తి కార్యాచరణ వ్యయం రికవరీ, పన్ను రాయితీలు, మరియు ప్రభుత్వ భూమికి ప్రవేశం వంటి సౌకర్యాలను ప్రైవేట్ సంస్థలకు అందించాయి.

PPP కి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ నుండి జాతీయ స్థాయి వరకు ఉద్యమం

జాతీయ స్థాయిలో ఈ PPP మోడల్ యొక్క విస్తృత ప్రభావాలను వివరిస్తూ, PAV ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలకు తమ ప్రచారాన్ని విస్తరిస్తోంది. ప్రజలకు ఈ సమాచారం అందించి మరియు వారి మద్దతు సేకరించే కార్యక్రమం కొనసాగుతోంది. చాలా మంది ప్రముఖులు ముఖ్యమంత్రికి లేఖలు రాసి ప్రైవేటీకరణ ప్రణాళికను ఉపసంహరించాలని కోరుతున్నారు. ఈ ఉద్యమానికి మీడియా కవరేజ్ కూడా పెరుగుతోంది. ఈ సమస్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాదు. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి PPP-ఆధారిత ప్రైవేటీకరణ ప్రతిపాదనలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్తున్నాయి. ఈ సందర్భంలో, ప్రజా ఆరోగ్య వేదిక వైద్య ఆరోగ్య రంగం ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 24, 2025న విజయవాడలో జాతీయ సదస్సు నిర్వహిస్తోంది, జన స్వాస్థ్య అభియాన్ కార్యకర్తలు మరియు దేశవ్యాప్తంగా పౌర సమాజ కార్యకర్తలను ఐక్యం చేసి, సమన్వయ వ్యూహాన్ని రూపొందించాలని పిలుపునిచ్చింది. ఇప్పుడు వైద్య విద్య మరియు ఆరోగ్య సేవల కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాల్సిన సమయం. ఆంధ్రప్రదేశ్‌లోని శక్తివంతమైన ప్రజా ఉద్యమం జాతీయ స్థాయిలో విస్తరించేందుకు ఒక బలమైన ప్రారంభం. ప్రభుత్వ ఆరోగ్య సంస్థలను కార్పొరేట్ ఆధీనం నుండి కాపాడుకోవడానికి, అందరికీ సరసమైన వైద్య విద్య మరియు ఉచిత, నాణ్యమైన ఆరోగ్య సేవల హక్కును అందించడానికి భారతదేశ ప్రజలు అందరూ చేతులు కలపి సమిష్టిగా పోరాడాల్సిన సమయం ఇది. కనుక లాభాపేక్షే లక్షంగా ఉండే “వైద్య రంగ కార్పొరేటీకరణ” అనేది సామాన్య ప్రజానీకుల ఆరోగ్య హక్కుకు (RIGHT TO HEALTH) విషూతం కలిగించే చర్య. దీన్ని దేశ ప్రజలే కాకుండా, ప్రవాసులు (NRIs) కూడా ఖండించి, ఈ వైద్య ఆరోగ్య రంగాల ప్రయివేటీకరణ ప్రతిపాదలను విరమించుకోవాలని ప్రభుత్వాలపై వత్తిడి చేయాలి.

Author

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top